BHAGAVATA KADHA-3    Chapters   

దుర్వాస శాపమునుండి రక్షించినవిధము

54

శ్లో || యోనో జుగోప వనమేత్య దురంత కృచ్ఛ్రాత్‌

దుర్వాససో7రి విహితాదయుతాగ్ర భుగ్యః |

శాకాన్న శిష్ట ముపభుజ్య యత స్త్రిలోకీం

తృప్తా మమంస్త సలిలే వినిమగ్న సంఘః ||

- శ్రీభాగ. 1 స్కం. 15 ఆ. 11 శ్లో.

''సీ|| దుర్వాసుఁడొకనాడు దర్యోధనుఁడు పంపఁ

బదివేల శిష్యులు భక్తిఁగొలువఁ

జనుదెంచి మనము బాంచాలియుఁగుడిచిన

వెనుక నాహారంబు వేఁడికొనినఁ

బెట్టెద ననవుఁడుఁ బెట్టకున్న శపింతు

ననుచుఁ దోయావగాహమున కేగఁ

గడవల నన్న శాకములు దీఱుటఁ జూచి

పాంచాల పుత్రిక పర్ణ శాల

గీ|| లోనఁ దలఁచిన విచ్చేసి లోవిలోని

శిష్ట శాకాన్నలవముఁ బ్రాసించి తవసి

కోపముడిగించి పరిపూర్ణ కుక్షిఁజేసె

నిట్టి త్రైలోక్య సంతర్పి యెందుఁగలఁడు?''

అట్టివాఁడు ''మనలను విడనాడి చనియె మనుజాధీశా''

ఛప్పయ

మూర్తిమావజోకోవ తపస్వీ దుర్వాస ముని |

శాప దివావన శత్రు పఠాయే వన వైభవ సుని ||

అక్షయ రవి కో పాత్ర ఖాఇ మలి కృష్ణా నిబటీ|

అతిథి భ##యే లే శిష్య నబని చిత చింతా చిపటీ ||

దుఖమే సుఖమేఁ శోకమేఁ, హైఁ జాకీ గోవింద గతి |

శ్యామ పుకారే కరుణాస్వర, భఈ ద్రౌపదీ దుఖిత అతి ||

అర్థము

దుర్యోధనాదులు వనములో మనకుఁగల వైభవమును విని ద్వేషించి యెట్లైనను కోపమే రూపముగాఁ గలిగిన తపస్వి యగు దుర్వాస మహర్షిచే శామిప్పింపఁదలచి యాతనని మన దగ్గఱకుఁ బంపెను. అప్పటికి సూర్యుఁడిచ్చిన అక్షయపాత్ర నప్పటికే ద్రౌపది వాడివేసెను. అట్టి లేనిసమయములో పదివేల మంది శిష్యులతో సహా అతిథియై దుర్వాసుఁడు రాఁగా మన కందఱకును జింత యుప్పతిల్లెను.

సుఖ, దుఃఖ శోకములం దే గోవిందుఁడు మనకు గతి యయ్యెనో ఆ గోవిందునిగూర్చి ద్రౌపది దుఃఖితయై అతికరుణా స్వరమునఁబిలిచెను.

పరోక్షమున నున్నంతప్రేమ, ప్రభావము సమీపమున నుండఁగా నుండదు. గుణముమానవుని అనుస్థితిలోనే బయట పడును. ధర్మరాజుకు రాజసూయ యాగము చేయవలెనను దుష్కరమగు కోరిక కలదు. అదియు శ్రీకృష్ణ కృపవలననే నెఱవేరినది. దుష్టులు కపటముచే రాజ్యమును హరించి నిండుసభలో ద్రౌపదిని దాసీనిజేసి వివస్త్రను జేయఁ బ్రయత్నింపఁగా శ్రీకృష్ణుడు వచ్చి రక్షించెను. ఈ విషయము స్మరణమునకు వచ్చునప్పటికి ధర్మరాజునకు తన వనవాస విషయము లన్నియు స్మరణకు వచ్చెను. ఆతఁడు అర్జునునితో నిట్లనెను:- ''అర్జునా! శ్రీకృష్ణుఁడు మనలను సర్వత్ర రక్షించెను. వనవాససమయమున మన బంధువు లందఱు మనలను ధర్మోపదేశము లోసంగుచు, తీర్థవ్రతములను గూర్చి చెప్పుచు, ధర్మసూక్ష్మముల నెఱింగించుచు మన కనేక విధముల ధైర్యమును జెప్పుచు మరల రాజ్యము అభించునను విశ్వాసము కలిగించెను. మనకేధైన విపత్తు సంభవించెనా ఆతఁడు వెంటనే పరుగిడి వచ్చెడువాఁడు. వనవాస ప్రసంగ మేదైనఁ జెప్పుము. తమ్ముడా! ఈ కథలచే నాశోకము కొంచెము కొంచెముగ తగ్గుచున్నది. చిత్తమునకు ధైర్యము కలుగుచున్నది.''

వనవాస ప్రసంగము వచ్చునప్పటికి అర్జునుని రెండు కన్నుల నీరునిండెను. అర్జునుఁడు తనకంటినీటిని వస్త్రముతోఁ దుడుచుకొని యిట్లనెను:- ''రాజా! వనవాసములో నా ప్రభువు అగుగడుగునకు కృపఁజూపుచుండెను.. శరీరముతో నాతఁడు ద్వారకాపురిలో నున్నప్పటికిని, మనస్సుతో నాతఁడు మన సమీపముననే యుండెను. ఏదైన గొప్పవిపత్తు సంభవించెనా అప్పుడాతఁడు నశరీరుఁడై వచ్చి మనకు వచ్చిన విపత్తుల నన్నింటిని నిమిషములోఁబోగొట్టి రక్షించెడువాఁడు. జయించిన రాజ్యమును, ధనమును ధృతరాష్ట్రుఁడు మరల పాండవులకీయఁగలఁడని దుర్యోధనునకుఁదోచి యెట్లైనను వీరికి దక్కకుండ చేయవలెనని యాతఁడు కుటిలమునుబన్ని పండ్రెండు సంవత్సరములు వనవాసము, ఒకసంవత్సరము ఆజ్ఞాతవాసము చేయునట్లు వణమును బెట్టి మలర జూదమాడెను. ఎవరోడెదరో వారు పండ్రెండు సంవత్సరములు సర్వస్వమును ద్యజించి వనవాసము చేయవలయును. చివరకు ఒకసంవత్సరము అజ్ఞాతవాసము ఎవరికిని తెలియకుండ చేయవలయును. ఒకవేళ అజ్ఞాతవాస సమయమున కనుఁగొనబడినచో మర పండ్రెండు సంవత్సరములు అరణ్య వాసము, మరల నొకసంవత్సరమజ్ఞాతవాసము చేయవలయును. ఈ విధముగ నజ్ఞాతవాస నియమ మెల్లప్పుడుజరుగుచునే యుండును.

అసలీ పందెము పెట్టుటకు కారణము ఎల్లప్పుడు మనలను రాజ్యవిహీనులఁజేయవలెననియే. మీరు దానికి ఒప్పుకొంటిరి. చివరకు మీరే ఓడిపోయితిరి. దుర్యోధనుఁడు కట్టు గుడ్డలతో ద్రౌపతితోఁగూడ మనలను రాజ్యమునుండి వెడలఁగొట్టెను. ఆ సమయమున వేలకొలఁది వేదపాఠకులు మీవెంట వచ్చిరి. మీరా బ్రాహ్మణులతోఁజేతులుజోడించి యిట్లంటిరి:- ''భూమి సురోత్తములారా! నేను సమర్థుడనై యుండఁగా మీకు యథావక్తిగ స్వాగత సత్కారములు కావించితిని. ఇప్పుడు నేను రాజ్యభ్రష్టుడనైతిని. ఇప్పుడు మీ యామారము విషయమునఁ జింతింపవలసి యుండును. కావున మీరందఱును తిరిగి వెళ్లి దుర్యోధను నాశ్రయింపవలయును. ఆతఁడు మీకు జీవనాధారము చూపఁగలఁడు. నావలెనే ఆతఁడును మీకు సమస్త సేవా శుశ్రూషలు చేయఁగలఁడు.''

మీ రిట్లు పలుకఁగా బ్రాహ్మణులు వినయముతో నిట్లనరి:- ''రాజా! మేము దుష్టుడగు దుర్యోధనుని ఆశ్రయమున నుండజాలము. మాకు జావనచింత లేదు. మేము స్వయముగ వనమునకు పోయి కందమూలపలదాలను దెచ్చుకొనియు, భిక్షించియు జీవననిర్వాహము కావింమచుకొందుము. మీరు మా యాహారము విషయమునఁ జింత జెంద పనిలేదు. మేము మీ ధర్మాచరణమునకు సంతుష్టులమైతిమి. మీ ధర్మప్రేమ వశీభూతులమై మేము మిమ్ములను వదలఁజాలకున్నాము. మీకే గతియో మాకు నదియే గతి, కావున మీరు మమ్ముఁ బరిత్యజింపవలదు.''

అంత మీరిట్లంటిరి:- ''విప్రులారా! నేను స్వేచ్ఛగా మిమ్ములఁ ద్యజించుటలేదు. మిమ్ములను బోషింపఁజాలకపోవుట చేతనే నే నిట్లు మిమ్ములను బ్రార్థింపవలసివచ్చినది. నేనుండఁగా మీరు భిక్షకు వెళ్లుటయు, కందమూలమలు చింతయే యుండుటయు ఇట్లు చేయుటచే నుండియు వ్యర్థము. ఛీ! నేను క్షత్రియుఁడ నేలనైతిని? మంచిది, నేనింకొక ఉపాయమును ఆలోచించెదను.''

ఇట్లని మీరు వారి నోదార్చితిరి. సూర్యనారాయణ మూర్తి ఆరాధించియు, శ్రీకృష్ణ కృపవలయనను నీకొక అక్షయ పాత్ర లభించినది. అది యెందఱకైన వంటలేకుండగనే భోజనము పెట్టగఁలదు. దానినుండి అనేక భోజనపదార్థములు వెలువడును. ఆ పాత్ర లభించుటచే మీరత్యానందమును బొందితిరి. ఆ పదార్థములచే మీరు దేవ, ఋషి, పితృదేవతలను దృప్తినొందించుచుఁ బ్రతిదినము సహస్రబ్రాహ్మణులకు సంతర్పణయు, నింక ననేక మానవులకు భోజనముచేఁదృప్తినొందించుచు వనములో నుండియు నింద్రప్రస్థములోవలె నతివైభవముతో నుంటిరి. ఎక్కడ చూచినను మీయాతిథ్య ఖ్యాతియే వ్యాపించెను. ఎక్కడ చూచినను మీ గుణగానమే. శ్రీకృష్ణ కృపచే మీకు వనములోఁ గూడ రాజ్యమునకంటె నెక్కువ కీర్తిప్రతిష్ఠలు కలిగినవి.

శత్రువుల హృదయములకు బాధ కలిగెను. వనములో మీ కిట్టి వైభవము జరుగుటను గాంచి శత్రువులు వ్యాకులత చెందుచుండిరి. కాని యేమిచేయఁగలరు? మనతోఁబోరాడుటకు వారికి సాహసములేదు. ఇఁక జూద మాడలేరు. మన సోదరులకు కలహము కలిగింపఁజాలకుండిరి. మన యుత్కర్షను గాంచి వారు మండిపోవుచుండిరి. ఎట్లైనను మనల నాశముచేయఁజూచుచుండిరి. ఇంతలో క్రోధావతారుఁడును, శాపములకు నిలయమును, పరమ తేజస్వియు నగు దుర్వాసమహర్షి హస్తినాపురమునకు వచ్చెను. అతని రాకవలన వారికి మిక్కిలి సంతోషమయ్యెను. వారి కార్యము నెఱవేరుట కాతని నుపయోగించుకొనఁదలఁచిరి.

దుర్వాసమహాముని సహస్ర శిష్యులతో హస్తినాపురమునకుఁజాతుర్మాస్య దీక్షకై వచ్చెను. ఆతఁడు దుర్యోధనునిఁ బరీక్షింపఁదలఁచి, యాతని ననేక విధములఁ దిట్టుచుండెను. అసమయమున భోజనము కావలె ననుచుండెను. మంచిరుచిగల పదార్థములను సిద్ధము చేయించిన వాటిని బనికిరావనును. సేవకులను గద్దించి కోపబడుచుండెను. ఆతఁడేవిపరీతాచరణముచేసి నప్పటికిని కౌరవుల నెట్లైనఁ గుపితులఁ జేయవలెననియే. కాని దుర్యోధనుఁడు చాల జాగ్రత్తగ నుండెను. ఆతఁడు మనో వాక్కాయకర్మలఁదన శక్తిని ధారపోసి మునిని సేవించుచుండెను. ఆతనిని బ్రసన్నునిఁ జెయుట కాతఁడెంతో తంటాలు పడుచుండెను. ముని ఉచితముగను, అనుచితముగను. అనుకూల ముగను, బ్రతికూలముగను, సామయికముగను, అసామయికముగను ఆజ్ఞల నొసంగుచుండిన ఆతఁడు వెంటనే నెఱవేర్చు చుండెను. దానికి వ్యతిరేకముగ నొక్క శబ్దమైనఁ బలుకుటలేదు. ముని చెప్పినదానికి ప్రతిదానికి అంగీకరించి చేతులు జోడించుచుండెను. ఆతఁడు తన సహన శీలతచే నెప్పుడు సంతుష్టుఁడు కాని మునికూడ సంతుష్టిని జెందెను. దుర్వాసమహర్షి అతిన సహన శీలతకు, సేవకు ప్రసన్నుఁడై యిట్లనెను:- ''రాజా! నీవు నా మనస్సుకు వ్యతిరేకముగ నడువలేదు. అనుచిత, ప్రతికూలాచరణము వలనను నీవు విసుగుకొనలేదు. మిక్కిటి సంతుష్టుఁడనైతిని. నీవు నీకిష్టము వచ్చిన యెట్టి కఠినవరమైన నడుగుము. ఇచ్చెదను. నీకు ప్రియమగు కార్యమును నీ సంతోషము కొఱకు చేయఁదలఁచితిని.''

దుర్యోధనునకు ధనైశ్వర్యములకు లోటులేదు. కావున నవి యవసరములేదు ఆతని హృదయమునకు మన అన్నదమ్ముల మైదుగురము కంటకములుగ నుంటిమి. మన వినాశము వలన నాతనికిఁగలుగు సంతోషము త్రైలోక్యరాజ్యము లభించినను లభింపదు దుష్గులకు పరుల సుఖనాశమువలన సంతోషము కలుగును. ఆతఁడు మిక్కిలివినయముతో మునిచరణములకు మ్రొక్కి కపట వచనములతో నిట్లనెను:- ''మీరు ప్రసన్నులగుటయే నాకు వేయి వరదానములతో సమానము. నా సేవచే మీరు సంతుష్టులరైతిరి. అంతే చాలు. నాకు సమస్త వరములు లభించినట్లే. మీరంతగా నన్ను వరమడుగు మనుచున్నారు కావున నేనొక్క వరమడుగు చున్నాను. మీరు నాయందనుగ్రహముంచి నాయాతిథ్యమున కెట్లు వచ్చితిరో అట్లే యాయన్నయగు ధర్మరాజు దగ్గఱకు మీవేయిమంది శిష్యులతోఁబోయి ఆతనిఁగృపఁజూడుఁడు. ఆతఁడు మావంశములో జ్యేష్ఠుఁడు, శ్రేష్ఠుఁడు, ధర్మాత్ముఁడు, ధర్మపాశబద్ధుఁడగుటచేతనే యాతఁడిప్పుడు వనవాసము చేయుచున్నాఁడు. అక్కడ కూడ ఆతఁడసంఖ్యాకులగు నతిథులకు సంతర్పణచేసి సంతోషపెట్టుచున్నాఁడు. మీరచ్చటకు శిష్యులతోఁబోయి నన్నెట్లు పరీక్షించితిరో ఆతని నట్లే పరీక్షింపుఁడు.--

దుర్వాసునకుఁ గావలసిని దదియే. ఆతఁడిట్లనెను:- ''మంచిది. మేమిప్పుడే వెళ్లెదము. మేము ధర్మరాజుని యాతిథ్యము నవశ్యము గ్రహింతుము.''

దుర్యోధనుని హృదయములో పాపవాసన కలదు. ఆతఁడు చెడ్డభావనతో మునినిఁ బంపుచున్నాఁడు. ఆతని పన్నాగము. మునికెట్లైనఁ గోపము వచ్చి మనలను శిపంపవలయునని. కావున నాతఁడిట్లనెను:- ''స్వామీ! అట్లు కాదు ద్రౌపదీదేవి భోజనము చేసిన తర్వాత మీరచ్చటికి చేరవయును. వెళ్ళగానే మీరు భోజన మగుగుఁడు.''

దుర్వాసునకు సంతోషమయ్యెను. ఆతఁడు దీని కంగీకరించెను. ద్రౌపదా భోజనము చేసిన తర్వాత పోయిన సూర్యదత్తమగు నక్షయపాత్రలో భోజనమేమియు నుండదు. ముని మఱునాఁటివఱకు కనిపెట్టుకొని యుండుఁను. వెంటనే భోజనము కావవలెనను. ఆ ఘోరవనములో ధర్మరాజు సహస్రహబ్రాహ్మణులకెట్లు క్షణములో భోజన మేర్పాటు చేయఁగలడు? వెంటనే భోజన మిడక పోవుటచేఁగుపితుఁడై శాపమొసంగి పాండవుల భస్మము కావంచును. ఈ విధముగా ననాయాసముగానే శత్రునాశము కాఁగలదు. ''పాము చావవలెను, బడితె విరుగరాదు. తన కపకీర్తి రాఁగూడదు. తన శత్రులు నశించి తాను సామ్రాట్టై రాజ్యమేలవలయును.'' అని దుర్యోధనుఁ దాటోచించుకొని దుర్వాసమునిని మనదగ్గఱకుఁబంపెను.

ఆదినమున నేదియో పర్వము. వేలకొలది ఋషులు, మునులు, బ్రాహ్మణులు భోజనము చేయుటయే గాక ద్రౌపది కూడ భోజనముచేసివేసెను. ఆమె ఆ అక్షయ పాత్రను బాగుగా తోమి యట్లుంచఁగానే దుర్వాసుఁడు శిష్యులతో వచ్చెను. ధర్మారాజు యధోచిత పూజాసత్కారములు కావించి భోజనము చేయవలసినదని ప్రార్థించెను. ఆతఁడు వచ్చిన దిందులకే కదా! అందువలన నాతఁడిట్లనెను:- ''రాజా! మాకు మిక్కిలి ఆఁకలి అగుచున్నది. నీవు త్వరగా వంటచేయించుము. ఇంతలో మధ్యాహ్నసంధ్యావందనము చేసికొని వచ్చెదము. వచ్చునప్పటికి భోజనము తయారు చేయించవలెను.''

ఇట్లని ముని ప్రత్యుత్తరము నాశింపకయే పరీక్షించుటకై సరోవరమునకు స్నానమునకుఁబోయెను.

అప్పుడు మీరెంతయో చింతించితిరి. ఇఁక ఋషిచే శపింపఁబడి మనము భస్మము కావలసియుండునని మేమును భయపడితిమి. పదివేలమందికి ఒక్కగడియలో నేపదార్థములచేఁ దృప్తి పెట్టఁగలుగుదుము? ఏసామగ్రులతో వారల కాతిథ్య సత్కారము లోనర్పఁగలము? మన అందఱకంటె ద్రౌపది కెక్కుడు చింతకలిగినది. ఆమె గృహిణి. గృహలక్ష్మికి ఆతిథ్య భార మెక్కుడుగఁగలదు. ఇంటికి వచ్చిన యతిథులకు సమస్త విధములగు నాహారపానీయముల నొసంగి సంతుష్టులఁచేయుట మహిళలకుఁ దెలిసినట్లు మనకుఁదెలియదు. ఆమె భోజనము చేయకున్న లక్షమంది అతిథులు వచ్చినప్పటికిని చింతలేదు. కాని ఆదినమున నామె భోజనము చేసినది. అక్షయపాత్ర సిద్ధి ఆదినము నకు అయిపోయినది. సౌమ్యఋషి అయియుండిన యెడల, నాతని పాదములు పట్టుకొని పరిస్థితిని వివరించి చెప్పి సమాధానపరచవచ్చును, కనాఇ ఇక్కడ అంతా యెదురు తిరిగినది. వచ్చినది దుర్ధర్షుఁడు దుర్వాస మహర్షి. ఆతనికి నచ్చజెప్పుటయుఁ, బ్రార్థించుటయు సంతయు వ్యర్థమే. ఆతని యభిప్రాయమునకు విరుద్ధమెక్కడనైన కనఁబడెనా శాపము పెట్టితీరును. ద్రౌపదికి అప్పుడు ఉపాయమేమియుఁ దోఁచలేదు. 'దిక్కులేని వారికి రాముఁడే దిక్కు' -ఆమె ఆర్తితో నార్తిహరుని బిలిచెను. దుఃఖమనస్కయై ద్వారకాధీశుని శరణు వేఁడెను. ఆమె కన్నుల నీరు నించి గద్గదకంఠముతో నేడ్చుచు నిట్లు పిలిచెను:- ''శ్యామసుందరా! నా మొఱ విని నా పసుపు కుంకమును నిలుపుము. నా మంగళసూత్రము నక్షయము కావింపుము. నన్ను విధవను గాకుండఁజేయుము. నా పతులకు వచ్చిన విపత్తులను దొలిఁగించుము. కోపిష్ఠియగు దుర్వాసుఁడు అసంతుష్టుఁడై శాప మొసంగకుండునట్లు చేయుము. అశరణశరణా! నీవే మాకు గతి. ఘోరాతిఘోరవిపద్విభంజనా! నీవు మమ్ములను రక్షించితివి, కాని యీ విపత్తు అన్నిటికంటె భయంకరమైనది. బ్రాహ్మణ శాపదగ్ధులకు పరలోకములుకూడ లేదు. అందఱలో నపకీర్తియుఁగలుగును. నీకు భక్తులగు నాభర్తల కీదుర్దశ సంభవించినచో నది నీకు లజ్జాకరమగు విషయము. నీ భక్తవత్సలతా బిరుతము నకుఁబెద్దదెబ్బ. మా రాజ్యము, ఇట్లు, వాఁకిలి పోయి అడవులలోఁదిరుగుచున్నప్పటికిని మాకు చింతలేదు. కాని మమ్ముల నీ విపత్తునుండి రక్షించుము.'' ద్రౌపది యిట్లనుచుండఁగనే శ్రీకృష్ణుని అడుగులచప్పుడు వినఁబడడెను. తన యశ్రుజలములచేఁ గమలనయనుఁడగు కృష్ణున కర్ఘ్యమొసంగెను. ఆతని రెండు చరణములు తడసిపోయెను. అత్యంతవ్యగ్రతతో శ్యామసుందరుఁడు ద్రౌపదితో నిట్లనెను:- ''ద్రౌపదీ! ద్రౌపదీ! నాకు మిక్కిలిగ ఆఁకలి అగుచున్నదమ్మా! తినుట కేదైనఁబెట్టుము.'' ద్రౌపది కన్నుల నీరుకార్చుచుఁ బ్రేమకోపస్వరమున నిట్లనెను:- ''నీ కెప్పుడును ఎగతాళియే. తినుటకు ఇంటిలో నేమైన నుండిన నిన్నార్తితోఁ బిలుచటెందులకు? ద్వారకానుండి ఇంత కష్టపెట్టి యెందులకు రప్పింతుము?''

ఆతఁడీ ప్రత్యుత్తరమును విని నవ్వలేదు. తన వ్యగ్రతను దగ్గించనులేదు. నేను బయటనిలుచుండి శ్యామసుందరుఁడే విచిత్రమును చేయునో చూతమని ఆతని నటనను జూచుచునేయుంటిని. అదేస్వరముతో నాతఁడిట్లనెను:- ''ఈ ఆఁడువారి కెప్పుడును కంటనీరే కారుచుండును. ఎప్పుడు తలఁచుకొనిన నప్పుడు కంటనీరు కార్చెదరు. విషయము చెప్పుము, ఎందుల కేడ్చుచున్నావో? నాకు భోజనము పెట్టుము. చాలా దూరమునుండి వచ్చుచున్నాను. కంటనీరు పెట్టుచున్నావు. కంట నీరు పెట్టిన కడుపునిండునా యేమి?''

అత్యంత కాతరభావముతోఁ గుపితయై మమత్వమును బుంజీభవింపఁజేయుచు ద్రౌపది యిట్లనెను:- ''ఇప్పుడింకొక దుర్వాసుఁడు వచ్చియున్నాఁడు. నీ శాపమువలన నాకు భయము లేదు. నీకిచ్చుటకు నావద్ద నొక గింజైన లేదు. ఈ విషయము నేను స్పస్ఠముగఁ జెప్పుచున్నాను. రేపు ఇష్టమువచ్చినట్లు తిన వచ్చును. ఇవ్వేళ మమ్ముల నిజమగు దుర్వాసునినుండి రక్షించుము. ఆతని శాపాగ్నికి మమ్ముల దగ్ధులఁగాకుండఁజేయుము.''

ఆతఁడదేస్వరముతో నిట్లనెను:- ఆదుర్వాసుని సంగతి తర్వాత చూచుకొనవచ్చును. ఆతఁడిక్కడ లేఁడుకదా! చంకలో వానిని వదలి సావడిలోనివాని చింత యెందులకు? ఆతఁడిక్కడికి వచ్చినప్పుడు చూచుకొనవచ్చును. ముందు నాకు తినుటకేమైన నిమ్ము.''

ద్రౌపది మిక్కిలి దీనతతో నిట్లనెను:- ''ప్రభూ! అధికముగ నుపహాసము చేయకుము అసమయ పరిహాసము బాగుండదు. సూర్యదత్తమగు పాత్రను నేను తోమిపెట్టితిని. ఇఁక నేఁటికి దానిలో నేమియు దొరకదు. నీకేమి పెట్టఁగలను?''

భగవానుఁడిట్లనెను:- ''దేవీ! నీ వన్నపూర్ణవు. నీ భాండారము అక్షయము. అది యెన్నటికి వట్టువడదు. ముందా పాత్రను దీసికొనిరమ్ము. నాతృప్తి కొఱకు దానిలోఁగొంచెమో గొప్పయో యుండకపోదు.''

ద్రౌపది కుపితయై మిక్కిలి శీఘ్రముగఁ బాత్రను దెచ్చి శ్రీకృష్ణుని సమ్ముఖమునఁబడవేసి యిట్లనెను:- ''చూడుము. నేనిప్పుడే బాగుగా తోమి పెట్టితిని. దీనిలనో నేముండును?''

పాత్రను బాగుగా పరీక్షించి చూచెను. దైవయోగమున ద్రౌపది తోమునపుడు దానికి ఒకమూలను ఆకుకూర ఒకటి అతుకొని యుండెను. ద్రౌపది దానినిఁజూడనేలేదు. దానిని గాంచి మిక్కిలి సంతోషముతో హరియిట్లనెను:- ''చూడుము దీనిలో నేమియు లేదంటివి. దీనిలో నెంతకూర ఉన్నదో చూడుము. ఇది నాకడుపు నిండుటకేకాదు. సమస్త చరాచర ప్రపంచమును తృప్తిపెట్టఁగలదు.'' ఇట్లని దానిని వ్రేలితోఁ దీసి కృష్ణుఁడు తన అఱచేతిలో వేసికొని 'యీ శాకమాత్రముచే సమస్త బ్రహ్మాండము తృప్తిచెందుఁగాక!' యని నోట వేసికొనెను.

నిజముగా నా సమయమున పొట్ట లుబ్బిపోయెను. స్నానము చేయుచున్న దుర్వాసునకును, ఆతని శిష్యులకును పెద్దపెద్ద త్రేపులు వచ్చెను. వారిలో వారిట్లనుకొనిరి:- ''మన పొట్టలో నొక్క మెతుకు పోవుకుఁగూడ సందులేదు. మనము భోజనము చేయక పోయిన ధర్మరాజు కుపితుఁడై శపించునేమో నని దుర్వాసుఁడు కూడ భయపడెను. ఆతనికి అంబరీషుని దగ్గఱ జరిగిన విషయము జ్ఞప్తికి వచ్చెను. భగవానుని సుదర్శన చక్రతేజము జ్ఞాపకము వచ్చునప్పటికి ఆతని ముఖము వాడి పోయెను. అప్పుడు వారెవరితోడను జెప్పకయే పారిపోయిరి. ఆతని శిష్యులు కూడ ఆతనితోఁబాటు కాలికి బుద్ధి చెప్పిరి.

కృష్ణుఁడు భీమునితో నిట్లనెను:- ''భీమసేనా! నీవు శీఘ్రముగా వెళ్లి మునులతోఁగూడుకొని దుర్వసుని భోజనమునకు రమ్మని చెప్పుము. వంట సిద్ధమైనది.''

ఆమాట వినఁగానే భీముఁడు పరువిడెను. భీముఁడు వెళ్లి చూచునప్పటికి మునులందఱును గౌపీనములుపొడివి పెట్టుకొనకమే తడి గోఁచుల తోడనే పారిపోవుచుండిరి. భీముడు దుముకుచుఁ బరువిడి వారినిఁబట్టుకొని యిట్లనెను:- ''స్వాములారా! ఆపద్ధతి బాగుండలేదు. మీరు వంటచేయుమని చెప్పి పారిపోవుచున్నారు. మాసామగ్రి యంతయు నష్టమైపోయినది. అది యేమికావలయును?''

మిక్కిలి దీనముగా దుర్వాసుఁడిట్లనెను:- ''భీమసేనా! నిజము చెప్పుచున్నాను. ఏమి జరిగినదో కాని పొట్టలో ఆవగింజ పట్టనంత సందుకూడ లేదు. అట్లు పొట్ట ఉబ్బిపోయినది. ఇప్పుడేమైనఁ దింటిమా యమలోకమునకుఁబోవలసినదే. మమ్ములను క్షమింపుఁడు. ధర్మరాజుతో మామీఁదఁ గోపపడవలదని చెప్పుము. పరిస్థితి పెడ తిరుగకున్నచో మేమాతని మాతిథ్యమును గొనెడువారమే.''

భీముఁడింతమాత్రమునకే ఒప్పుకొనునా? ఆతఁడిట్లనెను:- ''అయితే స్వామీ! మీరిప్పుడు రాకపోయిన మమ్ముల నాశీర్వదించి వెళ్లుఁడు.''

దుర్వాసుఁడు ప్రసన్నుఁడై యిట్లనెను:- ''నేను హృదయపూర్వకముగ నాశీర్వదించుచున్నాను. మీరు సమస్త భూమండలమును ఏకఛత్రాధిపతులుగ నేలఁగలరు. మీరు బాగుగా వృద్ధి పొందుదురు గాక! మీ నాశము నాశించి యెవ్వరు పాప బుద్ధితో మీవద్దకు నన్నుఁబంపిరో వారికి సర్వనాశము కలుగుఁగాక! వాని వంశములో వారికి నీరు విడుచువారు కూడ లేకుండఁబోవుఁగాక!''

ఈ విధముగ నెవని కృపచే మనము దుఃఖవిముక్తులమైతిమో, శాపమునుండి రక్షింపఁబడితియో, ఆపత్తులను గదచితిమో, ఆ పరాత్పర ప్రభువు మనల నందఱను వదలి వెళ్లి పోయినాఁడు. మన కార్యములన్నియు గుర్తులుగ నిలిచియున్నవి. ఇప్పుడు ఈలోకమంతము నరకముగఁ దోఁచుచున్నది. ఈ భోగము లనుభవించుటవలన మనకేమి సుఖము? రాజా! ఇప్పుడు మనము కూడ భగవానుని మార్గము ననుసరింప వలయును.''

ఇట్లు చెప్పుచుఁ జెప్పుచు నర్జునుఁడు మరల దుఃఖితుఁడయ్యెను.

ఛప్పయ

సునత ప్రియా కీ టేర బేర నహిఁ కరీ వధారే !

'అతి భూఖో కఛు దేహు' ఆఇ యే వచన ఉచారే ||

రోఈ కృష్ణా పాత్ర లాఇ ఆగే ధరి దీన్హోఁ |

శాక పత్ర కూఁ పాఇ, తీప్త సబరో జగకీన్హోఁ ||

న్హాత మునిని ఫూల్యో ఉదర, లేద డకార వలాయఁసబ |

టారీ బృహద విపత్తి జిన, గయే త్యాగ సంసార అబ ||

అర్థము

ద్రౌపది పిలిచిన పిలుపును విన ఆలస్యము చేయక శ్రీకృష్ణుడు వచ్చి 'నే నతి ఆఁకలిని జెందితిని తినుట కైమైనఁ బెట్టు మనెను. ద్రౌపది రోదనము చేయుచు నేమియు లేదని అక్షయపాత్రను గొనివచ్చి ఆయన ముందఱ వేసెను. శ్రీకృష్ణుడు దానిలో వెదకి ఒక శాక పత్రమును గనుఁగొని తిని సమస్త జగమును దృప్తిపొందించెను.

ఇంతలో స్నానమునకు వెళ్లిన దుర్వాసమహాముని కడుపు లుబ్బెను. వారు త్రేఁపులు త్రేఁపుడు పలాయనము పఠించిరి. ఇటువంటి గొప్ప విపత్తులనుండి దాఁటవేసిన ప్రభువు ఈ లోకమును వదలిపెట్టి పోయెను.

BHAGAVATA KADHA-3    Chapters